19, నవంబర్ 2018, సోమవారం

శ్రీశైల దర్శనం

   
కాశీ మూడుసార్లు వెళ్లాను కానీ,శ్రీశైలం వెళ్ళాలన్న కోరిక  ఇన్నాళ్లకు తీరింది. చాలాకాలం నుంచి వెళ్లాలన్న శ్రీశైలం యాత్ర ఈ ఏడాది కార్తిక మాస ఆరంభంలో  వెళ్లే అదృష్టం దక్కింది. మల్లన్న, భ్రమరాంబ దర్శన భాగ్యం కలిగింది. ప్రతియేటా ఆర్టీసీ పంచారామాలు, శ్రీశైలం తదితర ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులు నడుపుతుంది. ఆరేడుసార్లు ఆర్టీసీ సౌజన్యంతో పంచారామాలు వెళ్లి వచ్చాను. అయితే ఈసారి శ్రీశైలం వెళ్లాలని అనుకోవడం ఆర్ ఎం రవికుమార్ ప్రెస్ మీట్ సందర్బంగా ప్రస్తావించడంతో డిపో మేనేజర్ శ్రీ పెద్దిరాజు సరేనన్నారు. శ్రీశైలానికి ప్రతిరోజూ స్పెషల్ బస్సు నడుపుతామని చెప్పడంతో రద్దీ సమయంలో కాకుండా వెళ్లాలని దీపావళి తర్వాత రోజు రాత్రి వెళ్లాలని నిర్ణయించుకుని టికెట్స్ అడిగితే,రాత్రి 8న్నర రెగ్యులర్ బస్సుకు  నాలుగు టికెట్స్ బ్లాక్ చేసారు. అయితే  చివరి వరకూ టెన్షన్ గానే సాగింది యాత్ర.
  శ్రీశైలం వెళుతున్న సంగతి జాంపేట బ్యాంకు చైర్మన్ శ్రీ బొమ్మన రాజకుమార్ గారికి బ్యాంకు లో ఉండగా చెప్పాను. ఆయన శ్రీశైలంలోని  శ్రీ ఉమా రామలింగేశ్వర దేవాంగ సత్రానికి ఫోన్ చేసి, రాజమండ్రి నుంచి రేపు ఉదయం నలుగురు వస్తున్నారని రూమ్,భోజనం అన్నీ ఏర్పాటు చేయాలని, డబ్బులు తీసుకోవద్దని భాస్కరరావు అనే వ్యక్తికి  చెప్పేసారు. ఇక అందరికీ అక్రిడేషన్స్ ఉండవని,అందుకే  అక్రిడేషన్ తో సంబంధం లేకుండా తీసుకెళ్లే ఏర్పాట్లు చేయాలని కోరడంతో అలాగే అని డిఎమ్ చెప్పారు. నవంబర్ 8గురువారం రాత్రి 8న్నర బస్ కి బయలుదేరాలని నిర్ణయించడంతో సమాచారం సత్యనారాయణ,కళ్యాణ్ గ్రాఫిక్స్ డిటిపి శ్రీనివాస్,కేకే యాడ్స్ జేజిరావు లకు రెడీ అవ్వమని  చెప్పేసారు. అయితే సాయంత్రం 5గంటల ప్రాంతానికి సత్యనారాయణ గారు తనకు రావడం కుదరదని చెప్పడంతో ఎవర్ని తీసుకెళ్లాలా అని ఆలోచనలో  పడ్డాను. మొత్తానికి 7.30 ప్రాంతంలో ఫోన్ చేస్తే, సత్యనారాయణ గారు వస్తున్నట్టు చెప్పారు. డిపోకు వెళ్ళాక సర్వీస్ నెంబర్ 2809బస్సు ఫ్లాట్ ఫారం మీద చూసి ఎక్కడానికి  వెళ్తే,టికెట్ తీయాలని  డ్రైవర్ చెప్పాడు. డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ సెక్షన్ అధికారి అలాగే అన్నాడు. ఈలోగా డిపో మేనేజర్ కి ఫోన్ చేయడంతో తీసుకెళ్లమని,స్క్వాడ్ వస్తే తనకు ఫోన్ చేయమని సూచించడంతో, డ్రైవర్  మమ్మల్ని బస్సు ఎక్కమన్నాడు. హమ్మయ్య అంటూ ఎక్కాం.











  9వ తేదీ శుక్రవారం  ఉదయం 9గంటల ప్రాంతానికి దిగాం. కొండమీద బస్టాప్ లో దిగాక రిటర్న్ అదే బస్సులో రావడానికి టికెట్స్ బ్లాక్ చేయమని అడిగితే, ఏ ఎస్ ఎం కి ఫోన్ చేయమన్నారు. చేశాను. ఆయన కర్నూల్ డిపోకు చేయమన్నారు. చేశాను. కానీ రాజమండ్రి డిపో మేనేజర్ చెప్పాలని అనడంతో డిఎమ్ శ్రీ పెద్దిరాజు గారికి ఫోన్ చేశాను. విషయం చెప్పేసరికి నేను చేయిస్తానని అన్నారు. దాంతో ముందుగానే సత్రం రిజర్వ్ కావడంతో నడుచుకుంటూ దగ్గరలోని దేవాంగ సత్రానికి వెళ్ళాం. అక్కడ ఏసీ రూమ్ ఇవ్వడంతో ఫ్రెష్ అప్ అయ్యాం. మల్లికార్జునుడు, భ్రమరాంబ అమ్మవారి దర్శనానికి బయలుదేరాం. జనం రద్దీ చూసి, 150రూపాయల టికెట్ తీసుకుని దర్శనం పూరీచేశాం. ప్రసాదాలు కొన్నాం.
  అక్కడ నుంచి రూమ్ కి వచ్చేసాం. భోజనాలు పూర్తయ్యాక ఒంటిగంటకు ఆటోలో సైట్ సీయింగ్ కి బయలు దేరాం. మనిషికి 75చొప్పున ఇమ్మంటే సరేనన్నాం. సాక్షి గణపతి,హఠకేశ్వరం,పాలధార - పంచధార, శిఖర దర్శనం ఇలా ఐదు ప్రదేశాలు పూర్తిచేసుకుని,3గంటలకల్లా రూమ్ కి వచ్చేసాం. మళ్ళీ ఫ్రెష్ అప్ అయి,డిపోకు బయలు దేరాం. అప్పటికే డిపో మేనేజర్ శ్రీ పెద్దిరాజు గారు ఫోన్ చేసి టికెట్స్ చేయించానని వెళ్లి చూసుకోమని చెప్పడంతో, డిపోలోపల కౌంటర్ దగ్గరకు వెళ్లి అడిగితె రిజర్వ్ అయ్యాయని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నాం. సాయంత్రం 4న్నర గంటలకు కరెక్ట్ గా 2810సర్వీస్ నెంబర్  బస్సు బయలుదేరింది. దారిలో టిఫిన్ కింద దోశలు తినేసాం. ఉదయం 5గంటలకల్లా రాజమండ్రి డిపోలో దిగాం.అదే బస్సులో వెళ్లి అదే బస్సులో తిరిగి వచ్చాం. సత్యనారాయణ గారి బైక్ మీద నన్ను ఇంటికి డ్రాప్ చేసారు. అలా శ్రీశైలం దర్శనం మొత్తానికి పూర్తిచేశాను. అయితే ఒకరోజు కాకుండా మూడు నాలుగు రోజులు ఉండి పోయేలా వెళ్లి,అక్కడ శ్రీశైలం డ్యామ్,మ్యూజియం,పరిసర ప్రాంతాలు చూసి వస్తే బాగుంటుందని పించింది. అయితే  మళ్ళీ శ్రీశైల దర్శనం అవుతోందో లేదో చూడాలి.  

4, నవంబర్ 2018, ఆదివారం

ఇదో ఆత్మీయ కార్యక్రమం

 'బ్నిం'గారి షష్ట్యబ్ది పూర్తి వేడుక



  దాదాపు నాలుగేళ్ల క్రితం హైద్రాబాద్ వెళ్ళాను. మళ్ళీ ఈ ఏడాది అక్టోబర్ 27న వెళ్ళాను. ఆత్రేయపురం వాసి,  హైద్రాబాద్ లో వివిధ రంగాల్లో రాణిస్తున్న రచయిత,చిత్రకారుడు,కార్టూనిస్టు,నృత్య రూపక రచయిత శ్రీ భమిడిపల్లి నరసింహ మూర్తి ( 'బ్నిం')గారి షష్ట్యబ్ది పూర్తి సందర్బంగా వేడుకలో పాల్గొనేందుకు  గౌతమీ ఎక్స్ ప్రెస్ కి తత్కాల్ లో టికెట్ తీసుకుని వెళ్లి,28ఉదయం సికింద్రాబాద్ లో దిగాను. అక్కడ నుంచి బస్సులో స్నేహపూరి మా పిన్ని ఇంటికి చేరుకున్నాను. మధ్యాహ్నం భోజనం అయ్యాక క్యాబ్ లో బయలుదేరి వేడుక జరిగే నాంపల్లి  పబ్లిక్ గార్డెన్స్ ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియానికి చేరుకున్నాను. సాయంత్రం 5గంటలకు వేడుక మొదలైంది. షష్ట్యబ్ది పూర్తి వేడుకను బాపు రమణ అకాడమీ(ఆత్రేయపురం) సౌజన్యంతో అక్షజ్ణ పబ్లికేషన్స్ ,హాస్యానందం తెలుగు పత్రిక నిర్వహణలో నిర్వహించారు. ఆత్మీయ పూరిత వాతావరణంలో దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన  ఈ వేడుకను శ్రీ దైవజ్ఞ  శర్మ జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. శ్రీ 'బ్నిం' సోదరులు శ్రీ సుబ్రహ్మణ్య శర్మ  వ్యాఖ్యాతగా వ్యవహరించి,కార్యక్రమాన్ని నడిపించారు.




   వినాయక ప్రార్థనకు నృత్యంతో కార్యక్రమాలు మొదలయ్యాయి.  శ్రీ బాపు సోదరులు   శ్రీ సత్తిరాజు శంకర నారాయణ,సర్వశ్రీ ఓలేటి పార్వతీశం,గుండు సుదర్శన్,జి వల్లీశ్వర్,వంశీ రామరాజు,డివిఎస్ శాస్త్రి,శంకు, మీర్, మిధునం రచయిత శ్రీ  శ్రీరమణ,ఎస్వీఎస్ లక్ష్మీనారాయణ, ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. అక్షజ్ణ రఘునాధరావు, ఇంకా బోల్డంత మంది కార్టూనిస్టులు విచ్చేసారు. అలాగే  శ్రీ సాధనాల స్వామినాయుడు,జర్నలిస్ట్ జయసూర్య అక్కడ ప్రత్యక్షమయ్యారు. 
    ఈసందర్బంగా  అలాగే  'బ్నిం'రచించి ఎస్పీ బాలు,సునీత ఆలపించిన వేంకటేశ్వర భక్తి గీతం (ఎన్ని జన్మల పుణ్యమో)కు అనుగుణంగా శ్రీమతి జె. రేణుక ప్రభాకర్  శిష్య బృందం చే నృత్య ప్రదర్శన, అలాగే 'బ్నిం'రచించిన "శివగీతం'నృత్య గీతానికి అనుగుణంగా నృత్య ప్రదర్శన అలరించాయి. శ్రీ  'బ్నిం' గురించి రూపొందించిన డాక్యుమెంటరీని ప్రదర్శించారు. అలాగే నటుడు,రచయిత,దర్శకుడు శ్రీ తనికెళ్ళ భరణి, 'బ్నిం'తో చిన్ననాటినుంచి గల అనుబంధం గుర్తుచేసుకుంటూ పంపిన అభినందన సందేశాన్ని,అలాగే అక్షజ్ణ పబ్లికేషన్స్ నిర్వాహకులు శ్రీ ముదునూరి వెంకటేశ్వరరావు, టివి యాక్టర్  పుష్ప, అదేవిధంగా శ్రీ ఎంవిఎల్ గారబ్బాయి శ్రీ రామ్ ప్రసాద్ (నార్వే),  అమెరికానుంచి పంపిన వీడియో  సందేశాన్ని ప్రముఖ యాంకర్ సుమ, 'బ్నిం'గారి వలన తెలుగు నేర్చుకునే అవకాశం దక్కిందని చెబుతూ పంపిన అభినందన సందేశాన్ని, అలాగే  ఎం ఐ ఎఫ్  స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ రేవతి మెట్టెకూరు(అమెరికా),  పంపిన అభినందన సందేశాన్ని ప్రదర్శించారు. ఆతర్వాత  'బ్నిం'రచించిన  'హరిహరాద్వైతం'నృత్య గీతానికి  శ్రీ ముడుంబై వేదవ్యాస్ నృత్య ప్రదర్శన చేసి అలరించారు. 




  శ్రీ సత్తిరాజు శంకర నారాయణ గారి "మన కార్టునిస్టుల రూపురేఖలు" 'బ్నిం' అభిమానులు రూపొందించిన మన  'బ్నిం' పుస్తకాలను ఆవిష్కరించారు. దీంతో పాటు 'బ్నిం' గారి గురించి సెంటర్ స్ప్రెడ్ తో  వేసిన  'సరికొత్త సమాచారం'సంచికను ఆవిష్కరించారు. ఆ సమయంలో  నన్ను వేదికమీదికి ఆహ్వానించడం ద్వారా గౌరవించడం  'బ్నిం' గారి సంస్కారానికి నిదర్శనం.  శ్రీ  శ్రీరమణ మాట్లాడుతూ తాను మిధునం రాయడానికి ప్రేరణ  'బ్నిం' అని చెప్పారు.  'బ్నిం' ఇంకా అద్భుతాలు సృష్టించాలని ఆకాంక్షించారు. మిధునం కి  డాన్స్ బేలే రాయమని అడిగానని, అది త్వరలో పూర్తిచేయాలని కోరగా, దీనికి 'బ్నిం' స్పందిస్తూ త్వరలో ఆ పని పూర్తిచేస్తానన్నారు. హరిహర టివి అధినేత  శ్రీ ఓలేటి పార్వతీశం మాట్లాడుతూ సినిమా నటులకు ఎంత ఫాలోయింగ్ ఉందో 'బ్నిం'కి అంతటి ఫాలోయింగ్ ఉందన్నారు. ప్రస్తుతం  రంగస్థలం,టీవీల్లో ఉద్దండులైన కళాకారులకు  'బ్నిం'ఆచార్యత్వం వహించడం సామాన్య విషయం కాదన్నారు. కార్టూనిస్టు  శ్రీ శంకు మాట్లాడుతూ 'బ్నిం' ద్వారా మరిన్ని అద్భుత కథలు,ప్రహసనాలు వెలుగులోకి రావాలని ఆకాంక్షించారు.

    శ్రీ వల్లీశ్వర్ మాట్లాడుతూ  మఠం వేసుకుని కూర్చుని గణేశుడు ముల్లోకాలు దర్శిస్తే,ఈ గణేశుడు ( 'బ్నిం')కూర్చున్నచోటే అన్నింటినీ దర్శిస్తూ అద్భుత చిత్రాలు, రచనలు చేసారని   అభివర్ణించారు.  ప్రముఖ  కార్టూనిస్టుల రేఖా చిత్రాలను నిక్షిప్తం చేసి శ్రీ శంకర్ రూపొందించిన పుస్తకం పదిలంగా దాచుకునే పుస్తకమని  పేర్కొన్నారు.
   సినీ నటుడు గుండు సుదర్శన్ మాట్లాడుతూ  ఆర్ట్ చూపడమే కాదు హార్ట్ ని టచ్ చేసేవాడు  'బ్నిం' అని పేర్కొన్నారు. శ్రీ వంశీ రామరాజు మాట్లాడుతూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చర్చించుకుని 'బ్నిం'అనే దివ్యమైన త్రిమూర్తి స్వరూపుడుని మనకు అందించారని అభివర్ణించారు. శ్రీ  మీర్ మాట్లాడుతూ నా జీవితంలో ఎన్నో మైలురాళ్ళు 'బ్నిం' సొంతమన్నారు.

    శ్రీ శంకర్ మాట్లాడుతూ ఇప్పటివరకూ ఐదు పుస్తకాలు వచ్చాయని అయితే ఈ పుస్తకం  'బ్నిం' పుట్టినరోజు నాడు ఆవిష్కరించడం తన 82ఏళ్ళ జీవితంలో మరపురాని ఘట్టమన్నారు. శ్రీ డి.వి.ఎస్. శాస్త్రి మాట్లాడుతూ  'బ్నిం' రాసిన నృత్య రూపకాల పాటలను శ్రావ్యంగా పాడుతూ  'బ్నిం' గొప్పతనాన్ని ఆవిష్కరించారు. శ్రీ  ఎస్వీఎస్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జీవితంలో ఏదో అన్యాయం జరిగిందని తెగ బాధపడిపోతుంటామని,అయితే కించిత్ వ్యధ కూడా లేకుండా తన జీవితాన్ని తానె మలుపు తిప్పుకుని ఇంతమందికి ఆనందానిస్తూ  జీవించి చూపిస్తున్న వ్యక్తి  'బ్నిం' అని కొనియాడారు. ఎట్టి పరిస్థితులలో ఆత్మవిశ్వాసం కోల్పోని వ్యక్తి  'బ్నిం' అని ఆయన చెబుతూ  'బ్నిం' పక్కనుంటే అందరికీ అదోరకమైన ఆనందంగా భావిస్తారని అన్నారు. ఏదైనా సృషించడం,వికసింపజేయడం  'బ్నిం' కే చెల్లిందన్నారు. వందేళ్లకు సరిపడా వర్క్ ఆయన వద్ద ఉందన్నారు. హాస్యానందం తెలుగు పత్రిక నిర్వహించిన కార్టూన్ల పోటీలో విజేతలకు ఈ సందర్బంగా సరిఫికేట్స్ అందజేశారు.బాపు రమణ అకాడమీ కార్యదర్శి శ్రీ వేగిరాజు సుబ్బరాజు వందన సమర్పణ చేసారు. జనగణమనతో కార్యక్రమం ముగిసింది. సినీ విజ్ఞాన విశారద శ్రీ ఎస్వీ రామారావు, సర్వశ్రీ  ప్రసాద్ కాజా,కూర చిదంబరం,సువర్ణ భార్గవి,తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకకు వచ్చిన రచయితలూ,కార్టూనిస్టులు ఒకరికొకరు పలకరింపులు,సెల్ఫీలతో సందడి చేసారు.






  ఈ వేడుకకు వచ్చిన వారందరికీ ఆత్రేయపురం పూతరేకు,సమోసా,టీ అందించారు. శ్రీ సాధనాల స్వామి నాయుడు,జర్నలిస్ట్ జయసూర్యలను అక్కడ  కలవడం నిజంగా ఆనందం వేసింది. అలాగే పలువురు కార్టూనిస్టులు రావడంతో అందులో ప్రసాద్ కాజాను పరిచయం చేసుకోవడం, రాజమండ్రి అని చెప్పగానే కార్టూనిస్టు శేఖర్ గురించి అడగడం,వెంటనే ఆయనకు ఫోన్ చేసి మాట్లాడించడం జరిగాయి. నేను ఈ వేడుకకు వెళుతున్నానని చెప్పగానే రత్నం అండ్ సన్స్ అధినేత శ్రీ కెవి రమణమూర్తి గారు ఓ చిన్నసైజు పెన్ను ఇచ్చారు. దాన్ని శ్రీ  'బ్నిం'గారికి అందించాను. ఆర్టీసీ బస్సుకు రిజర్వేషన్ చేయించుకోవడంతో నడుచుకుంటూ లకడి కా పూల్ వెళ్ళాను. అయితే అక్కడ బస్సులు ఆగుతాయన్న నమ్మకం లేకపోవడంతో దిల్ సుఖ్ నగర్ కి ఆటోలో బయలు దేరాను. ఈలోగా బస్ డ్రైవర్ ఫోన్ చేయడంతో దిల్ సుఖ్ నగర్ లో ఎక్కుతానని చెప్పాను. అయితే అటు రాదని, ఎల్ బి నగర్ వచ్చేయమ్మని చెప్పడంతో సిటీ బస్ లో ఎల్బీ నగర్ కెపిటి మార్కెట్ కి వెళ్లాను. అక్కడ రాత్రి 10న్నర గంటలకు బస్సు రావడంతో ఎక్కాను. ఉదయం 7గంటలకు రాజమండ్రి చేరుకున్నాను.  మొత్తానికి ఓ ఆత్మీయ కార్యక్రమానికి హాజరవ్వడం ఓ మధురానుభూతి.