29, నవంబర్ 2014, శనివారం

మా ఊళ్ళో సుబ్రహ్మణ్య షష్టి సందడి

      
  సుబ్రహ్మణ్య షష్టి వచ్చిదంటే రాజానగరంలో  సందడే సందడి. ఇక్కడ  సుబ్రహ్మణ్య స్వామి షష్టి మహోత్సవాలు 5రోజుల పాటు చేస్తారు. తూర్పు గోదావరి జిల్లాలో బిక్కవోలు తర్వాత అంతటి ప్రాధాన్యత సంతరించుకున్న ఈ గుడితో  చిన్నప్పటి నుంచి  అనుబంధం వుంది. రాజానగరం జెడ్పీ హైస్కూల్ లో చదివే రోజుల్లో (1979 - 84 )  తెలుగు పండిట్ , స్కౌట్ మాస్టర్ స్వర్గీయ  మేదిని సత్యనారాయణ గారి సారధ్యంలో స్కౌట్ లో ఉండడం వల్ల షష్టి ఉత్సవాల్లో క్యులైన్ల దగ్గర తదితర చోట్ల  వాలంటరీ సేవలు చేసే వాళ్ళం. షష్టి రోజు స్కూల్ కి లోకల్ సెలవు ఇచ్చేవారు. 
     వివిధ కారణాల వల్ల,  ఫై గా రాజమండ్రి కోరుకొండ రోడ్ లోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉన్నందున మూడేళ్ళ నుంచి షష్టి ఉత్సవాలకు రాజానగరం వెళ్ళడం కుదరలేదు.  శుక్రవారం సాయంత్రం మా అమ్మాయి  ధాత్రి శ్రీహితను తీసుకెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్నా....  ఓ వైపు కడియపు శ్రీనివాసరావు నిర్వహణలో శ్రీ లక్ష్మీ వినాయక మ్యూజికల్ ఫుల్ బ్యాండ్ , మరో వైపు తీన్ మార్, ముకుందవరం సుంకర కామరాజు నేతృత్వంలో శ్రీ లక్ష్మీ గణపతి కోలాట భజన సంఘం చే కోలాటం ,  ఇంకో వైపు ఖర్జూరం - జీడ్లు కోట్లు  దుకాణాలు , ఆలయంలో స్వర్గీయ   పసలపూడి కనకయ్య  కుమారుడు - డోలు విద్వాంసుడు గణపతి సారధ్యంలో నాదస్వర కచేరీ ... ఇక స్వామి వారి కల్యాణం , సంబరం సరేసరి. భీమవరం మోహన్ ఆర్కెస్ట్రా చే  సినీ మ్యూజికల్ నైట్ , తోలు బొమ్మలాట , కనులు మిరుమిట్లు గొలిపే  వేట్లపాలెం బాణాసంచా కాల్పులు ...  ఇలా 88వ షష్టి మహోత్సవం సమాహారంగా  పలు కార్యక్రమాలతో ఊళ్ళోని నాలుగు రోడ్లు ఒకటే సందడి. మా పాప కేరింతలు ...  
    
 
     వివిధ ప్రాంతాల నుంచి  భక్తులు  ఇక్కడకు విచ్చేసి,  ఈ ఆలయంలో నాగ ప్రతిష్ట చేసి, మొక్కులు తీర్చుకుంటారు.  స్వర్గీయ తోట సత్యనారాయణ గారి వంశీకులైన రాజమండ్రి కెవి ఆర్ స్వామి రోడ్ లోని జయరాం జ్యుయలర్స్ అధినేత సంకా జయరాం గుప్తా దంపతులు, కుటుంబ సభ్యులు, ప్రతియేటా ఇక్కడ షష్టి మహోత్సవాలకు విచ్చేసి, స్వామి వారి కల్యాణం జరిపిస్తుంటారు.  ఈ ఏడాది కూడా షరామామూలే. కంకటాల సత్యనారాయణ (సత్తిపండు) గారి సారధ్యంలో ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేసింది.
    రాజానగరం రావులచెర్వు గట్టుని ఆనుకుని ఉన్న ఈ ఆలయంలో 88 ఏళ్ళ క్రితం   రాజమండ్రికి చెందిన  స్వర్గీయ తోట సత్యనారాయణ గారు స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు. శ్రీ వల్లీ దేవసేన సమేత సంతాన సుబ్రహ్మణ్యేశ్వరస్వామిగా పూజలు అందుకుంటున్న ఈ ఆలయాని సందర్శించి, పూజలు నిర్వహిస్తే, సంతానం కలుగుతుందని విశ్వాసం.

   ఉత్సవాలలో భాగంగా శనివారం  సాయంత్రం దిండి లక్ష్మీనారాయణ గారిచే శ్రీ వెంకటేశ్వర భక్తి గాన సుధ,  30వ తేదీ ఆదివారం రాత్రి హైదరాబాద్ - వైజాగ్ - విజయవాడ వారి కాంబినేషన్ లో అంధ కళాకారుల  సినీ సంగీత సంగీత విభావరి వుంటాయి. డిసెంబర్ ఒకటవ తేదీ సోమవారం రాత్రి సంపతనగరం లక్ష్మణరావు సారధ్యంలో శ్రీ రామాంజనేయ యుద్ధం నాటకం వుంటుంది.  2వ తేదీన స్వామివారికి  శ్రీ పుష్ప యాగం.  శ్రీ లక్ష్మీ గణపతి కోలాట భజన సంఘం చే కోలాటం జరుగుతాయి. 


25, నవంబర్ 2014, మంగళవారం

సేకరణ - పరిరక్షణలో మేటి ఏమ్వీ అప్పారావు గారు

     
ఏవైనా సేకరించడం ఓ ఎత్తు ... వాటిని భద్రపరచి పరిరక్షించడం మరో ఎత్తు .... ఈ రెంటినీ అలవోకగా నిర్వహిస్తున్న వాళ్ళల్లో ఏమ్వీ అప్పారావు గారు అందెవేసిన చేయి. కార్టూనిస్టుగా ,  బాపు - రమణలకు అభిమానిగా - వారితో పరిచయస్తునిగా, మంచి విషయాల సేకరించే దిట్టగా ఈయన శైలే వేరు.  స్టేట్ బాంక్ లో అధికారిగా పనిచేసి పదవీ విరమణ చేసి, విశ్రాంత జీవనం గడుపుతున్న ఈయన ముఖ పుస్తకంలో చురుకైన పాత్ర వహిస్తున్నారు. ఆయనకున్న  ఇద్దరు కుమార్తెలకు , ఓ కుమారునికి పెళ్ళిళ్ళు కూడా అయి, ముబాయి - చెన్నై లలో  ష్టిరపడడంతో ప్రశాంత జీవనం సాగిస్తున్నారు. రాజమండ్రి శ్రీరాం నగర్ లోని 500గజాల స్థలంలో వుండే ఇల్లుని అపార్ట్ మెంట్ డవలప్ మెంట్ కి ఇవ్వడంతో 12 ఫ్లాట్స్ తో   కామాక్షి రెసిడెన్సీ గా రూపుదిద్దుకుంది. అందులో ఎస్ -1లో ఏమ్వీ అప్పారావు - శ్రీమతి పద్మ దంపతులు వుంటున్నారు. ముఖ పుస్తకంలో నిత్యం కనిపించే అప్పారావు గారు రాజమండ్రిలో వున్నా , ముబాయి వెళ్ళినా , చెన్నై వెళ్ళినా సరే ముఖ పుస్తకంలో ఆయన కనిపిస్తారు. నిజంగా ఆయనకు ఏదో వ్యాపకంగా కాకే, స్నేహితులతో అనుబంధం కొనసాగించే సాధనంగా ముఖ పుస్తకాన్ని మలచుకున్నారు.
     ఏమ్వీ అప్పారావు గారు 1941మే 28న జన్మించిన ఏమ్వీ (మట్టేగుంట వెంకట) అప్పారావు రాజమండ్రిలోనే విద్యాభ్యాసం పూర్తిచేసి, స్టేట్ బాంక్ లో ఉద్యగంలో చేరారు. శ్రీకాకుళం లో క్యాషియర్ గా చేరిన ఈయన బాపట్ల లో కూడా కొనసాగించి ,  రాజమండ్రి బ్రాంచిలో క్రరికల్ విభాగంలో కొనసాగి , అమలాపురం బ్రాంచిలో మేనేజర్ గా, రాజమండ్రి ఇన్నీసుపేట బ్రాంచి, కొమరిగిరి పట్నం , విశాఖ స్టీల్ ప్లాంట్ బ్రాంచి, రాజమండ్రి బజార్ బ్రాంచిలలో పనిచేసి, సీతానగరం బ్రాంచిలో పనిచేస్తూ, 1998లో  పదవీ విరమణ చేసారు. ఆన్నట్టు ఈయన తండ్రి సుబ్బారావు కూడా స్టేట్ బాంక్ లో అధికారిగా పనిచేసారు.
 
ఇక చిన్న నాటినుంచి కార్టూన్లు గీయడం హాబి గల ఏమ్వీ అప్పారావు గారు 1958లో వేసిన కార్టూన్ ఆంద్ర పత్రికలో వేసారు. ఇక అప్పటినుంచి ఈయన  వేసిన కార్టూన్లు ఆంద్ర ప్రభ, ఆంధ్రజ్యోతి , స్వాతి వీక్లీలు; జ్యోతి మాసపత్రిక , బ్లిడ్జి ఇంగ్లీష్ వీక్లీ , ఇంకా పలు పత్రికలలో ప్రచురితమయ్యాయి. 2005లో బాపు - రమణ లతో పరిచయం కూడా ఏర్పడడంతో ఏమ్వీ అప్పారావు గారి ఆనందం రెట్టింపయింది. బాపు గారు రేఖ పేరిట కార్టూన్లు వేస్తే, అప్పారావు గారు' సురేఖ ' పేరిట కార్టూన్లు గీస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 8వేల కార్టూన్లు ఈయన వేసారు. ఇంకా వేస్తున్నారు.
   
 చందమామ పుస్తకాలు చిన్నప్పటి నుంచే చదివే ఈయన చందమామకు అభిమాని అయ్యారు. 1953నుంచి 1981వరకు చందమామ సంచికలు ఈయన దగ్గర భద్రంగా వున్నాయి.  అంటే కాదు తండ్రి సేకరించిన స్టాంప్స్ - నాణేలు కూడా ఈయన పరిరక్షిస్తున్నారు.
 


బాపు ఆల్బమ్స్ , పుస్తకాలు, వివిధ పత్రికల్లో అచ్చయిన ఆర్టికల్స్ ఇలా ఎన్నో ఏమ్వీ అప్పారావు గారు భద్రంగా ఉంచారు.  అంతేకాదు రాజమండ్రికి సంబంధించి ఏ వార్త ప్రచురితమైనా సరే , వాటిని సేకరించి ఆల్బం గా రూపొందించడం ఈయన సలక్షణం. ఈయన నివాసంలో ఆల్బమ్స్ - పుస్తకాలతో కూడిన బీరువాలు దర్శనమిస్తాయి. అందులో 1914నాటి 'ది ప్రాక్టీస్ ఆఫ్ ఆయిల్ పెయింటింగ్ ' ; 1938నాటి 'ఆరోగ్యం - దీర్ఘాయువు ' లాంటి అపురూప పుస్తకాలున్నాయి.  గోడమీద , బీరువాల దగ్గర వుండే  బాపు పెయింటింగ్స్ మీదకు మన దృష్టి వెళుతుంది.
 
  ఏమ్వీ అప్పారావు గారింటిలో అలనాటి గ్రామ్ ఫోన్ రికార్డ్ , టేప్ రికార్డర్, సిడి ప్లేయర్, విసి ఆర్ , డివిడి, పార్ట్ బిల్ టివి లతో పాటు ప్రస్తుత కాలంలోని ఎల్ ఇ డి- టివి కనిపిస్తాయి. ఇత్తడితో  చేసిన విగ్రహం , ఇత్తడి సిరా బుడ్డి - చెక్క పెన్;  పాత కెమెరాలు, ఇలా ఎన్నింటినో  ఈయన భద్రంగా దాచారు. రకరకాల  బొమ్మలు సేకరించారు.  ఆ ఇంటికి వెళితే ఆప్యాయ పలకరింపు వినిపిస్తుంది. అపురూప పుస్తకాలు , వస్తువులు ఆహ్లాదం కల్గిస్తాయి. అక్కడ ఉన్నంత సేపు కాలం తెలియదు.
    బాపు గారు మరణించినపుడు తీవ్ర మనోవేదనకు గురైన అప్పారావు గారు తన నివాసంలో బాపు సంతాప సమావేశం పెట్టి, మిత్రులతో కల్సి నివాళులర్పించారు. ఆ సమావేశానికి మిత్రుడు రామనారాయణ తో కల్సి వెళ్లాను. అప్పట్లో కొన్ని పుస్తకాలు, వస్తువులు చూసాను. మళ్ళీ ఓ సారి రావాలని ఆహ్వానిచడంతో ఎట్టకేలకు సోమవారం (24.11.14) సాయంత్రం మా పాప సూర్య ధాత్రి శ్రీహితను తీసుకుని వెళ్లాను. ఓ గంట సేపు అన్నీ పరిశీలించాక, చేసిన  ప్రయత్నమే ఇది .....

16, నవంబర్ 2014, ఆదివారం

లోక కళ్యాణార్ధం సాగిన 'కోటి గాయత్రి మహాయాగం'

   
లోక కళ్యాణార్ధం  రాజమండ్రిలో చేపట్టిన  చతుర్వింశతి కుండాత్మక హోమ సహిత కోటి గాయత్రి మహాయాగం దానవాయిపేట  టిటిడి కళ్యాణ మంటపంలో ఆదివారం పరిసమాప్తి అయింది.  ఇంతటి బృహత్తర కార్యక్రమానికి  సంకలన కర్త , యాగ సేవకుడు చిట్టిపంతులు, బ్రహ్మశ్రీ పుల్లాభట్ల కృష్ణ కిషోర్ శర్మసారధ్యం వహించారు.   ప్రకాశం నగర్ రౌండ్ పార్కు ధర్మంచర కమ్యూనిటి హాలులో ఆగస్టు 3వ తేది శ్రావణ శుద్ధ సప్తమి ఆదివారం ఈ మహాయాగం ప్రారంబించారు. దాదాపు100నుంచి 150మంది  దీక్షాపరులు 100రోజులపాటు ప్రతినిత్యం సహస్ర గాయత్రి మంత్రం జపం చేయించడమే ఈ దీక్ష లక్ష్యం. ప్రారంభం తర్వాత దీక్షాపరులు ఇన్నాళ్ళూ ఎవరి ఇంటి దగ్గర వారే నిష్టతో గాయత్రి మంత్రోపాసన సాగించారు.
 

 ఇక మహాయాగం చివరి దశకు చేరడంతో  టిటిడి కళ్యాణ మంటపంలో  గురువారం (నవంబర్ 13) నుంచి నాలుగురోజుల పాటు కొనసాగించారు.  మహామహోపాధ్యాయ , శాస్త్ర నిధి బ్రహ్మశ్రీ విశ్వనాధ గోపాలకృష్ణ శాస్త్రి, సాంగ వేదాచార్య బ్రహ్మశ్రీ చిర్రావూరి శ్రీరామ శర్మ వ్యాకరణ విభీషణ బ్రహ్మశ్రీ కొంపెల్ల సత్యనారాయణ శాస్త్రి , పిఎమ్ కె సత్రం స్మార్త విద్యాలయ ప్రధాన ఆచార్య బ్రహ్మశ్రీ పొక్కులూరి శ్రీరామచంద్ర మూర్తి దివ్య ఆశ్శీస్సులతో చతుర్వింశతి కుండాత్మక హోమ సహిత కోటి గాయత్రి యాగం చేపట్టారు.


 నాలుగు రోజుల కార్యక్రమంలో భాగంగా   గురువారం  హోమాలు నిర్వహించారు. బ్రహ్మశ్రీ చిర్రావూరి శ్రీరామ శర్మ దంపతులు విచ్చేసి, ఆశ్సీస్సులు అందించారు. సాయంత్రం  డాక్టర్ కేసాప్రగడ సత్యనారాయణ ప్రవచనం చేశారు.
   
       
 శుక్రవారం  సర్వతో భద్రమండలం తీర్చిదిద్ది  చండీపారాయణం, పార్వతీ కళ్యాణం నిర్వహించారు. ఆ సాయంత్రం  డాక్టర్  ధూళిపాళ మహాదేవమణి  ప్రపచనం చేసారు.   శనివారం   శ్రీ సుబ్రహ్మణ్య అభిషేకం, శ్రీ సుబ్రహ్మణ్యహోమం, శ్రీలక్ష్మీనారాయణహోమం, శ్రీసూర్యనారాయణ హోమం, సూర్య నమస్కారాలు, రాహు, కేతు, సర్పదోష తదితర దోష నివారణార్థం పూజలు , శ్రీ సుబ్రమణ్యస్వామి వారి అభిషేకం, సూర్యాభిషేకం నిర్వహించారు. ముత్య సీతారాముడు బ్రహ్మత్వంలో సాగిన ఈ కార్యక్రమాలలో పొక్కులూరి శ్రీరామ చంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు.  సాయంత్రం మహామహోపాధ్యాయ  బ్రహ్మశ్రీ   విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి ప్రవచనం చేసారు.
   

 పిఎమ్ కె సత్రం స్మార్త విద్యాలయ విద్యార్ధులు, ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమం   నవంబర్ 16వ తేది కార్తీక బహుళ నవమీ ఆదివారం తర్పణం, హోమం, పూర్ణాహుతి, అన్న సమారాధన కార్యక్రమాలతో యాగం పరిసమాప్తి అయ్యింది. కార్తిక వనసమారాధన కూడా  కల్సి వచ్చింది. 

'హిందూ వివాహ వ్యవస్థ'ఫై అవగాహనా సదస్సు

     

 సద్గురు శివానంద మూర్తి స్పూర్తితో పనిచేస్తున్న  శివానంద సుపథ ఫౌండే షన్  సమకాలీన కాలంలో సమస్యల పరిష్కారానికి కొన్ని చర్చా వేదికలు నిర్వహించ తలపెట్టి , అందులో తొలిప్రయత్నం గా సంస్కరణలకు కేంద్రమైన రాజమండ్రిలో సద్గురు శివానంద సత్సంగం  శాఖ తో కల్సి  రాజమండ్రి వై జంక్షన్ ఆనం రోటరీ హాలులో శనివారం 'హిందూ వివాహ వ్యవస్థ - నేటి సవాళ్లు - పరిష్కారాలు - .. కర్తవ్యాలు ' అనే అంశం ఫై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం 5గంటలకు ప్రారంభమైన సమావేశం దాదాపు నాలుగు గంటలపాటు సాగింది.  ప్రముఖ యూరాలజిస్టు డాక్టర్ టి.వి.నారాయణరావు అధ్యక్షత వహించారు. శివానంద సుపథ ఫౌండే షన్ చైర్మన్ ఎన్.వి.డి.ఎస్. రాజు స్వాగతోపన్యాసం చేసారు. ఫౌండే షన్ డైరెక్టర్ , సుపథ ద్వైమాస పత్రిక ఎడిటర్ డాక్టర్ వి.వి. హనుమంతరావు, సద్గురు శివానంద సత్సంగం రాజమండ్రి శాఖ ప్రతినిధి వాడ్రేవు మల్లపు రాజు నివేదికలు సమర్పించారు. మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ విశ్వనాధ గోపాల కృష్ణ శాస్త్రి , డాక్టర్ ధూళిపాళ మహాదేవమణి, న్యాయవాది భావరాజు పద్మావతి ప్రసంగాలు చేసారు.
   'భారతీయ వివాహ వ్యవస్థ ఒకప్పుడు బలంగా వుండేది. ఇప్పుడు ఒడుదుడుకులు ఎదుర్కొంటోంది. పెద్దలు కుదిర్చిన వివాహాలు - ప్రేమ పెళ్ళిళ్ళు అనే తేడా లేకుండా అన్నీ విఫలం అవుతున్నాయి. ఒకప్పుడు విడిపోవడం అనే మాట చాలా తక్కువగా వినిపిస్తే , ఇప్పుడు విడిపోవడం ఎక్కడ పడితే అక్కడ తాండవిస్తోంది. ఇటువంటి పరిస్థితులలో హిందూ వివాహ వ్యవస్థను పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. భార్యా భర్తల తగవులు పోలీసు స్టేషన్ దాకా వెళ్ళకుండా , సమాజంలోని పెద్దలు - ఆలోచనా పరులతో ఒక ధర్మ పీఠం మాదిరిగా కౌన్సిలింగ్ సెంటర్ లు ఏర్పడాలన్న సద్గురు శివానంద మూర్తి సూచన మేరకు ఆ దిశగా శివానంద సుపథ ఫౌండే షన్ చేస్తోంది' అని డాక్టర్ హనుమంతరావు వివరించారు. దీనివల్ల కొంత మార్పు వస్తుదన్న ఆకాంక్షను ఆయన వ్యక్తపరిచారు.
  మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ విశ్వనాధ గోపాల కృష్ణ శాస్త్రి మాట్లాడుతూ భార్యాభర్తల అన్యోన్య దాంపత్యం ఎంతో అవసరమన్నారు.   1) లోకంలో మంచి - చెడూ రెండూ వుంటాయి. అయితే కాలగమనంలో వీటి నిష్పత్తి మారుతూ వుంటుంది. 2) సత్సంతానం - యజ్ఞ యాగాల నిర్వహణకు వివాహ బంధం తప్పనిసరి. మనుష్యుల ఉన్నతి వివాహ వ్యవస్థతో ముడివడి వుంది.  3)యజ్ఞం చేస్తే , చేసిన వ్యక్తికి మాత్రమే ఫలితం వస్తుంది. కానీ కన్యాదానం చేస్తే , అటు పది తరాలు - ఇటు పది తరాలు తరిస్తాయి. యోగ్యుడిని చూసి, కన్యాదానం చేయాలని శాస్త్రం చెబుతోంది.  4)తాళి కట్టేస్తోనో, తలంబ్రాలు పోసేస్తోనో పెళ్లి అయిపోయినట్లు కాదు ,ఆతర్వాత చాలా తతంగం ఉంటుంది. సప్తపది వంటి ఎన్నో తంతులు వున్నాయి.
5) క్షణి కోద్రేకంలో - ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకుండా సదాలోచనతో నడవాలి. 6) నా పెళ్ళప్పుడు అమ్మా నాన్న పడ్డ కష్టాలు , నా ఇంటికి వచ్చే కోడలు పడకూడదని అత్త అనుకుని, అందుకు అనుగుణంగా ప్రవర్తించే విశాల హృదయం వుంటే , అసలు చాలా వరకు ఇబ్బందులు వుండవు. 7) ప్రాచీన శాస్త్రాల్లో ఎక్కడా విడిపోమ్మని ఎక్కడా చెప్పలేదు. కల్సి వుండాలని శాస్త్రాలు చాటిచెప్పాయి. 8) భార్యాభర్తల మధ్య అనురాగం వుండాలి. భర్తను భార్య గౌరవించాలి - భార్యను భర్త ప్రేమగా చూడాలి. భర్తను గౌరవించే విధానం అలవారచడానికి కవులు 'లక్ష్మీ - పార్వతి ల రసవత్తర సంవాదం చూపించారు. 9)మన శాస్త్రంలో గృహస్థాశ్రమం గురించి ఎంతో గొప్పగా చెప్పారు. 'సన్యాసికి భిక్ష కావాలంటే గృహస్తుల దగ్గరకే రావాలి . స్వాములకు , మహా పురుషులకు ఆశ్రయం ఇచ్చేది గృహస్తులే. యజ్ఞాలు - యాగాలు చేయాలంటే గృహస్తులై వుండాలి. శ్రాద్ధ కర్మలు చేసేది గృహస్తులే' ఇలా అన్ని రకాలుగా క్రతువులు చేయడానికి , ఆశ్రయం ఇవ్వడానికి గృహస్థాశ్రమం అవసరం. 10)ఇతరులు మనపట్ల ఎలా వ్యవహరిస్తే మనం ఆనందంగా ఉంటామో , అలాగే ఇతరులపట్ల మనం కూడా ప్రవర్తించాలి.  11)పాతివ్రత్యం - ఏకపత్నీవ్రతం పాటిస్తే రోగాల బారిన పడకుండా ఆరోగ్య వంతులుగా ఉండవచ్చు.. కోర్కెలను సన్మార్గంలో తీర్చుకోవడం ద్వారా ఆనందమయ జీవనం సాగించాలి.' అని వివరించారు.
    డాక్టర్ ధూళిపాళ మహాదేవ మణి మాట్లాడుతూ, 1)సుఖ దుఖాలు భార్యాభర్తల మధ్య ఒకేలా వుండాలి. ఆకర్షణ కంటే ప్రేమ సిద్ధాంతమే ఇద్దరి మధ్య గట్టి బంధం ఏర్పరుస్తుంది.  2) అడవిలో ఉన్న ఏడాదికాలం శ్రీరాముని కోసం సీతాదేవి ఎలా తపించిందో , అలాగే సీతా దేవి కోసం రాముడు పరితపించాడు. లక్ష్మణుని దగ్గర ఎన్నోసార్లు ప్రస్తావించి మరీ రాముడు కంట తడి పెట్టుకున్నాడు. కానీ అలా చెప్పుకోడానికి కూడా ఎవరూ లేక సీతమ్మ తల్లి తనలో తానే కుమిలిపోయింది. 3)భర్త తల్లిదండ్రులను భార్య , ... భార్య తల్లిదండ్రులను భర్త ప్రేమగా చూడాలి. 4)భర్త కోపతో వుంటే భార్య శాంతంగా వుండాలి - అదే భార్య కోపంగా వుంటే భర్త శాంతంగా వుండాలి.  అలా వున్నప్పుడు కొద్ది సేపటికి ఒకరి ఫై ఒకరికి ప్రేమ , అనురాగం వస్తాయి. ఇద్దరూ కోపంగా వుంటే ప్రమాద పరిస్థితులకు దారితీస్తాయి. 5)దురదృష్టవశాత్తూ టివీల్లో వచ్చే సీరియల్స్ కారణంగా ఇళ్ళల్లో ప్రశాంతత పోతోంది. 6)అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకుని , కోర్టు ద్వారా విడాకులు పొందడం సమంజసమా అన్నది ప్రతిఒక్కరూ ఆలోచిస్తే , పరిస్థితి చేయిదాటిపోదు. 7)పెళ్లి కి ముందు రోజు పెళ్లి మంత్రాల్లోని అర్ధాన్ని వివరించే ప్రయత్నం చేయాలి.  8)ఏది ఏమైనా ప్రారబ్దం నుంచి ఎవరూ తప్పించుకోలేరు. కర్మ సిద్ధాంతం ప్రకారం ఇది తప్పదు.
   న్యాయవాది పద్మావతి మాట్లాడుతూ ధర్మాన్ని అనుసరించి నడత వుండాలన్నారు. కట్టూ బొట్టూ వ్యవహారం గౌరవప్రదంగా వుంటే ఎలాంటి అనర్ధాలకు తావుండదని గుర్తించాలన్నారు. అలనాటి కాలంలో సీతాదేవి , అనసూయ , భువనేశ్వరి తదితరులు  ఎలా వ్యవహరించారో వివరిస్తూ, భార్యాభర్తలు  ఒకరినొకరు అర్ధం చేసుకుని జీవిస్తే , ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు.
    సభకు హాజరైన వాళ్ళు ఓపిగ్గా దాదాపు  నాలుగు గంటలపాటు కూర్చున్నారంటే సభ ఎంత రక్తి కట్టిందో చెప్పక్కర్లేదు. ఈ సమావేశానికి శ్రీ కొత్తపల్లి ఘన శ్యాంప్రసాద్ సతీసమేతంగా హాజరుకావడం మరో విశేషం. ఈ సందర్భంగా ఘన శ్యాంప్రసాద్ దంపతులను ఆది దంపతులుగా భావించి నిర్వాహకులు సత్కరించారు. అతిధులను , వక్తలను సత్కరించారు.  వాడ్రేవు వేణుగోపాలరావు - ఉమాదేవి దంపతులు, వాడ్రేవు శ్రీదేవి, ఓలేటి సత్యనారాయణ, జె పాండురంగారావు, దినవహి హనుమంతరావు, సివి సుబ్బారావు,తదితరులు పాల్గొన్నారు. కొత్తపల్లి అప్పాజీ వందనసమర్పణ అనంతరం  జన గణ మనతో కార్యక్రమం ముగించారు.

9, నవంబర్ 2014, ఆదివారం

స్వచ్చ గోదావరి జోడించి 'హారతి ఉత్సవ్'

    బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన గోదావరి హారతి ఉత్సవ్ కన్నుల పండువగా సాగింది. ఐదేళ్ళ క్రితం కార్తిక పౌర్ణమినాడు హారతికి స్వీకారం చుట్టి, ప్రతినెలా  పున్నమికి హారతి నిర్వహిస్తూ , 50మాసాలు పూర్తైన సందర్భంగా , 5వ వార్షిక వేడుక నేపధ్యంలో పలు అంశాలు జోడించి, కార్తిక పౌర్ణమి గురువారం (నవంబర్ 6) నాడు హారతి ఉత్సవ్ కన్నులపండువగా నిర్వహించారు.  దీంతో పుష్కర్ ఘాట్ ప్రాంతంలో సందడి నెలకొంది.
   గోదావరి పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ ...

     ఉదయం 9గంటలకు గోదావరి పర్యావరణ పరిరక్షణ గురించి విద్యార్ధులు , పౌరులతో  ఎబిఎన్ (ఆంధ్రజ్యోతి ) చానెల్ అధిపతి వేమూరి రాధాకృష్ణ, పుష్కర్ ఘాట్ దగ్గర సామూహిక ప్రతిజ్ఞ చేయించారు. శ్రీచైతన్య , ఆదిత్య కాలేజీల విద్యార్దులు , వివిధ స్కూల్స్ విద్యార్ధులు హాజరయ్యారు.
 
అనంతరం డిబి వెంకటపతిరాజు కాంప్లెక్స్ దగ్గర ఫోటోగ్రాఫర్స్ చిన్ని శ్రీను తదితరులు ఏర్పాటుచేసిన గోదావరి ఫోటోగ్రఫీ - వివిధ విభాగాలకు చెందిన చిత్రకళా ప్రదర్శన ను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఫైడికొండల మాణిక్యాలరావు, వేమూరి రాధాకృష్ణ ప్రారంబించారు.

  స్వచ్చ గోదావరి ఫై చర్చ ....

   ఆతర్వాత 'స్వచ్చ గోదావరి' చర్చా కార్యక్రమం (బిగ్ డిబేట్ ) ఎబిఎన్ (ఆంధ్రజ్యోతి ) చానెల్ అధిపతి రాధాకృష్ణ నిర్వహించారు. పుష్కరాల రేవు రెండు బ్రిడ్జిల నడుమ బోట్ మీద నిర్వహించిన ఈ చర్చా కార్యక్రమంలో మంత్రి ఫైడికొండల మాణిక్యాలరావు,మేయర్ పంతం రజనీ శేషసాయి , బుద్దవరపు ఎస్ ఎన్ కుమార్ , రాజమండ్రి సిటీ ఎం ఎల్ ఎ డాక్టర్ ఆకుల సత్యనారాయణ ,నగరపాలక సంస్థ కమీషనర్ రవీంద్రబాబు , మాజీ ఎం ఎల్ ఎ రౌతు సూర్యప్రకాశ రావు , మాజీ మేయర్ ఎం ఎల్ చక్రవర్తి, పర్యావరణ వేత్త డాక్టర్ తల్లావఝల పతంజలి శాస్త్రి , కార్పొరేటర్ ఇన్నమూరి రాంబాబు , చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు అశోక్ కుమార్ జైన్ తదితరులు మాట్లాడారు. ట్రస్ట్ ప్రతినిధులు ఎస్ ఎన్ రాజా, ప్రసాదుల హరినాధ్, పాత్రికేయులు  వి ఎస్ ఎస్ కృష్ణ కుమార్, కార్పొరేటర్ గొర్రెల సురేష్, హితకారిణి సమాజం మాజీ చైర్మన్ బుడ్డిగ శ్రీనివాస్, ఆర్యాపురం బ్యాంకు వైస్ చైర్మన్ అయ్యల గోపి, నాళం పద్మశ్రీ, ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి, నిమ్మలపూడి వీర్రాజు తదితరులు పాల్గొన్నారు
   సాయంత్రం గోదావరి నదిలో సాలంకృత పంటు మీద హారతి ఉత్సవ్ వేడుకలు నిర్వహించారు. మహిళలచే సామూహిక నామ పారాయణ, హైదరాబాద్ నృత్యమాల అకాడమీ చే గణేశ నృత్య ప్రార్ధన,  చెన్నై కి చెందిన బోంబే సిస్టర్స్ చే సంగీత కచేరీ జరిగాయి.

గోదావరి పురస్కారాలు అందజేత ...

      ఈ సందర్భంగా ప్రతియేటా ఇచ్చే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి (సాహిత్యం ) గోదావరి పురస్కారంతో పాటు గోదావరి తీరంలో వివిధ రంగాలలో కృషి చేసిన ప్రముఖుల పేరిట మొత్తం ఐదుగురికి గోదావరి పురస్కారాలు ఇచ్చారు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి (సాహిత్యం ) గోదావరి పురస్కారాన్ని  రిటైర్డ్ ఐపీ ఎస్ అధికారి - రచయిత రావులపాటి సీతారామారావు;  ఎ రవిశంకర ప్రసాద్ (పత్రికా రచన , పౌర హక్కులు , అవినీతి వ్యతిరేక ఉద్యమం ) గోదావరి పురస్కారాన్ని మల్లేపల్లి లక్ష్మయ్య ; సర్ ఆర్థర్ కాటన్ (నీటి పారుదల, వ్యవసాయం)గోదావరి పురస్కారాన్ని ఇరిగేషన్ పూర్వపు చీఫ్ ఇంజనీర్ బివిఎస్ రామారావు; ఎస్వీ రంగారావు (కళా రంగం )గోదావరి పురస్కారాన్ని దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు తరపున ఆయన కుమారుడు అరుణ కుమార్; జిఎంసి బాలయోగి (సంఘ సేవ , నిష్కళంక ప్రజాసేవ) గోదావరి పురస్కారాన్ని సామాజిక సేవకురాలు శ్రీమతి సునీతా లక్ష్మణ్ లకు ట్రస్ట్ పక్షాన అందజేసి , 25వేల రూపాయల నగదు , జ్ఞాపిక తో సత్కరించారు.


   ఎస్ వి బి సి ఉన్నతాధికారి బి. సంతోష్ కుమార్ శాస్త్రి వ్యాఖ్యాత గా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో బ్రిటీష్ డిప్యూటి హై కమీషనర్ ఆండ్రిస్ మాక్ లిస్టర్ విశిష్ట అతిధిగా పాల్గొన్నారు.   డిప్యూటీ స్ఫీకర్ మండలి బుద్ధ ప్రసాద్,  దేవాదాయ శాఖా మంత్రి ఫైడికొండల మాణిక్యాలరావు, రాజమండ్రి ఎంపి మాగంటి మురళీమోహన్, రాజమండ్రి మేయర్ పంతం రజనీశేషసాయి, రాజమండ్రి ఎమ్మెల్యేలు  డా.ఆకుల సత్యనారాయణ, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్యచౌదరి, పెందుర్తి వెంకటేష్ , నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి , రాజమండ్రి మాజీ ఎంపి ఉండవల్లి అరుణ కుమార్, మాజీ ఎం ఎల్ ఎల్ రౌతు సూర్యప్రకాశరావు ,  ప్రభుత్వవిఫ్ చైతన్య రాజు,ఎమ్మెల్సీలు  ఆదిరెడ్డి అప్పారావు, కె. రవివర్మ, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్  కె.రామచంద్రమూర్తి , ఆంధ్రజ్యోతి సంపాదకులు  కె.శ్రీనివాస్, మాజీడిజీపి - కె. అరవిందరావు, అతిధులుగా  హాజరయ్యారు. బుద్దవరపు ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ బిఎస్ ఎన్ కుమార్ స్వాగతం పలికిన ఈ కార్యక్రమంలో ఎస్ ఎన్ రాజా , ప్రసాదుల హరినాధ్, తదితరులు పర్యవేక్షించారు.
   
 మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ కొత్త రాజధాని నిర్మాణం విజయవాడ ప్రాంతంలో చేస్తున్నందున ఎంతో చారిత్రిక ప్రాధాన్యత గల రాజమహేంద్రవరాన్ని సాంస్కృతిక రాజధానిగా ప్రకటిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు నడయాడిన ; బ్రిటిషు వారి గుండుకు గుండెను ఎదురొడ్డిన టంగుటూరు ప్రకాశం పంతులు పాలన సాగించిన ఈ రాజమండ్రి ఎంతో ప్రాశస్త్యం కల్గిందన్నారు. ప్రతినెల హారతి కార్యక్రమానికి సహకరిస్తామని ఆయన చెబుతూ , వచ్చే ఏడాది జూలై 14నుంచి ప్రారంభమయ్యే గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు. ఎంపి మాగంటి మురళీమోహన్ మాట్లాడుతూ గోదావరి మధ్యలో పెద్ద సైజు గోదావరి మాత విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని , ఇందుకు అందరూ సహకరించాలని కోరారు.   అనంతరం గోదావరి కి షోడశోపచారాలతో హారతి సమర్పించారు.
   
 శ్రీ విజయ శంకర సంగీత నృత్య విద్యాలయం అధ్యాపకులు పసుమర్తి శ్రీనివాస శర్మ శిష్య బృందం నృత్యారాధన చేసారు. పెద్దయెత్తున భక్తులు పాల్గొని ఆద్యంతం తిలకించారు.

2, నవంబర్ 2014, ఆదివారం

కష్టకాలంలో జిల్లా కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన కందుల దుర్గేశ్

   
  తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ నూతన అధ్యక్షులుగా రాజమండ్రి నగరానికి చెందిన కందుల దుర్గేశ్ నియమితులయ్యారు. రాష్ట్ర విభజన కారణంగా తూర్పు గోదావరిలోనే కాకుండా ఎపి మొత్తం మీద ఒక్కసీటు కూడా కాంగ్రెస్ కి రాలేదు. కాంగ్రెస్ హేమాహేమీలంతా పార్టి వీడిపోతున్నారు. చాలామంది ఇప్పటికే టిడిపిలో చేరి పదవులు పొందగా , మరికొందరు వైస్సార్ సిపిలో వున్నారు.కాంగ్రెస్ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ తాజాగా బిజెపి గూటికి చేరగా , మరికొందరు నేతలు కూడా బిజెపిలోకి పోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో సెంటిమెంట్ కి మారుపేరైన తూర్పు గోదావరి జిల్లాలో కాంగ్రెస్ సారధ్య బాధ్యతలు చేపట్టడానికి దుర్గేశ్ ముందుకు రావడం నిజంగా సాహసమే.
     మొన్నటి ఎన్నికల్లో రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ నుంచి బరిలో దిగి , డిపాజిట్ కోల్పోయినా , ఏమాత్రం అధైర్య పడకుండా , కాంగ్రెస్ లోనే కొనసాగుతూ , ఇప్పుడు పార్టీ జిల్లా అధిపతిగా నియమితులయిన దుర్గేశ్ రాజకీయ కుటుంబానికి చెందినవారు. స్వాతంత్ర్య సమరయోధుడు , మాజీ మున్సిపల్ చైర్మన్ , మాజీ ఎం ఎల్ ఎ కందుల వీర రాఘవ స్వామి నాయుడు (కెవిఆర్ స్వామి నాయడు ), అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ , మాజీ ఎం ఎల్ ఎ పోతుల వీరభద్రరావు లకు  దుర్గేశ్ మనమడు.   రాజమండ్రిలో కీలక వ్యాపార వీధి అయిన నల్లమందు సందుగా కెవిఆర్ స్వామి నాయడు పేరు అలాగే మున్సిపల్ స్టేడియం కి అజాత శత్రువు పోతుల వీరభద్రరావు పేరు పెట్టారు.
   విద్యార్ధి కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ లో చురుగ్గా పాల్గొన్నదుర్గేశ్   యువజన కాంగ్రెస్ , కాంగ్రెస్ లలో వివిధ పదవులు నిర్వహిస్తూనే , సామాజిక సేవలో తనదైన ముద్ర వేసారు. గడిచిన 20ఏళ్లుగా ఆయనతో నాకున్న  పరిచయంలో అందరినీ కలుపుకెళ్ళే మృదు స్వాభావం ఆయనకుంది. సామాజిక విషయాల పట్ల అవగాహన గల దుర్గేశ్   స్రవంతి స్వచ్చంద సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. హుదూద్ తుపాన్ నేపధ్యంలో పలు పత్రికల్లో పర్యావరణ పరిరక్షణకు సంబంధించి పలు వ్యాసాలు, ముఖ్యంగా మడ అడవుల పరిరక్షణకు సంబంధించి వ్యాసాలూ వస్తున్నాయి. అయితే 1996 తుపాన్ లో కోనసీమ దెబ్బతిన్నపుడు స్రవంతి సంస్థ ద్వారా తీర ప్రాంతంలో తుపాన్ తాకిడి నుంచి రక్షణ పొందడానికి మడ అడవుల ఆవశ్యకత గురించి కృషి చేసిన దుర్గేశ్ , తాళ్ళరేవు మండలంలో ఆదిశగా అప్పట్లో కొంత కృషి చేసారు. బాల కార్మిక వ్యవస్థ రూపు మాపడానికి స్రవంతి ద్వారా కృషి సాగించారు.
     కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా ఉంటూ , ;పలు పదవులు నిర్వహించిన దుర్గేశ్ నగర కాంగ్రెస్ అధ్యక్షునిగా వ్యవహరించారు.  శాసన మండలికి ఎం ఎల్ ఎ ల కోటలో ఎన్నికయ్యారు. అప్పటి రాజమండ్రి ఎంపి ఉండవల్లి అరుణ కుమార్ ఎ ఐ సిసిలో బాధ్యతలు , వివిధ రాష్ట్రాల ఇంచార్జ్ గా వ్యవహరిస్తూ బిజీగా ఉన్న నేపధ్యంలో రాజమండ్రి పార్లమెంట్ ఇంచార్జ్ గా ఉంటూ , కార్యకర్తల, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేసారు. రాష్ట్ర విభజన నేపధ్యంలో కాంగెస్ ఆదిస్థానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ , ఉద్యమంలో పాల్గొన్నారు. ఆసమయంలో కొందరు నాయకులు పార్టీలు మారినా దుర్గేశ్ పార్టీ లోనే వుండిపోయారు. ఎంపి సీటు ఇస్తే , సాహసించి పోటీ చేసారు.
ఇక ఇప్పట్లో రాష్టంలో కాంగెస్ కి పుట్టగతులు ఉండవని తెల్సినా , పార్టీ జిల్లా సారధ్యం స్వీకరిస్తున్న దుర్గేశ్ అబినవ బాల చంద్రుడు గా (2007 నంది నాటకోత్సవాల్లో బాల చంద్రుని పాత్రతో అలరించారు) పార్టీని గడ్డు పరిస్థితి నుంచి గట్టెక్కిస్తారో లేదో కాలమే చెప్పాలి. ఏది ఏమైనా నమ్ముకున్న పార్టీలో ఉంటూ, కష్ట సమయంలో ఇంకా చెప్పాలంటే పార్టీని అందరూ ఈసడించుకుంటున్న దుర్భర పరిస్థితులలో కూడా  పార్టీ సారధ్యం వహించడానికి ముందుకు రావడం నిజంగా సాహసమే కాదు .... అంకిత భావానికి నిదర్శనం ...
 
  జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా నియమితులయ్యాక తొలిసారి శనివారం ఉదయం   జిల్లాకు విచ్చేసిన దుర్గేశ్ కి మధురపూడి విమానాశ్రయంలో పలువురు నాయకులు , కార్యకర్తలు , అభిమానులు స్వాగతం పల్కారు.  పార్టీకి పునర్ వైభవం తీసుకురావడానికి , పార్టీకి దూరమైనా వారిని దగ్గర చేర్చడానికి , కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న కార్యకర్తలకు కాపాడుకోడానికి కృషిచేస్తానని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.